అనంతపురం: కరోనా వైరస్ భయం ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఈస్ట్ నరసాపురం గ్రామంలో 75 ఏళ్ల మహిళ రోడ్డు పక్కన మరణించింది. 

కరోనా వైరస్ వ్యాధితో మరణించిందనే భయంతో స్థానికులు మాత్రమే కాకుండా ఆమె బంధువులు కూడా ఆమె శవం దగ్గరకు రావడానికి ఇష్టపడలేదు. కర్నూలు జిల్లా నుంచి ఆమె రావడంతో కరోనా వైరస్ బారిన పడి ఉంటుందని గ్రామస్థులు భావించారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. 

మృతురాలు దుర్గమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కర్నూలు శివారులోని కొత్తకోటలో ఆమె గత నాలుగు నెలలుగా ఆమె ఓ కూతురుతో కలిసి ఉంటోంది. వృద్ధాప్య పింఛనును తీసుకోవడానికి కూతురు ఆమెను గ్రామానికి తీసుకుని వచ్చింది. ఆటో రిక్షాలో ఆమెను ఏప్రిల్ 28వ తేదీన గ్రామంలో వదిలేసిన కూతురు అదే ఆటో రిక్షాలో వెళ్లిపోయింది.

వృద్ధురాలు కర్నూలు నుంచి రావడంతో గ్రామ వార్డు సిబ్బంది శివమొగ్గ మండలంలోని వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఆమెకు పెరాలిసిస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. కరోనా వైరస్ లక్షణాలు మాత్రం లేవు. అయినప్పటికీ కరోనా భయంతో ఆమెకు కనీసం ఆహారం కూడా అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

ఏ విధమైన సహాయం అందకపోవడంతో పెరాలిసిస్ కారణంగా శుక్రవారం ఆమె రోడ్డు పక్కన మరణించింది. ఆమెకు కరోనా లేదని స్థానిక నేత శ్రీరామిరెడ్డి స్థానికులకు, బంధువులకు నచ్చజెప్పారు. దాంతో గ్రామస్థులు ఆమెకు అంత్యక్రియలు చేశారు. బంధువులు కూడా అంత్యక్రియలకు వచ్చారు. 

గ్రామస్థుల్లో చైతన్యం పెంచిన సచివాలయ కార్యాలయ సిబ్బందిని, వైద్య సిబ్బందిని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రశంసించారు. అయితే, ఆమె ప్రాణాలు కాపాడలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు.