విశాఖపట్నం: కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నవారికి అండగా వుంటామని జగన్ సర్కార్ నిరూపించింది. కరోనాతో ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్య, పోలీస్, పారిశుద్ద్య సిబ్బందికే కాదు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలవద్దకు చేరుస్తున్న వాలంటీర్లకు కూడా భరోసానిచ్చే  నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. 

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గా పనిచేస్తున్న గబ్బాడ అనురాధ(26) గుండెపోటుతో మృతిచెందింది. శుక్రవారం ప్రభుత్వ పెన్షన్లను పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా అనురాధ గుండెపోటుకు  గురయ్యి అక్కడికక్కడే మృతిచెందింది. 

ఇలా విధినిర్వహణలో వుండగా వాలంటీర్ మరణించిన వార్త ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో చలించిపోయిన ఆయన వెంటనే సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ ఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. 

కాబట్టి గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను సీఎంఓ అధికారులు ఆదేశించారు.