గంజాయి నిందితుడికి వాలంటీర్ జాబ్... అరెస్ట్ తో బయటపడ్డ అసలు నిజం
గంజాయి కేసులో అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడికి వాలంటీర్ గా నియమించిన ఘటన అల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

పాడేరు : వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్ధపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు వాలంటీర్లు నేరాలకు పాల్పడుతుండటం జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెడుతోంది. తాజాగా గంజాయి కేసులో ఓ వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం చింతగరువు గ్రామానికి చెందిన వంతాల వెంకటరావు 2018 లో గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసిన పాడేరు పోలీసులు జైలుకు పంపించారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన అతడు ఇక బుద్దిగా ఉద్యోగం చేసుకోవాలని భావించాడు. ఈ సమయంలోనే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం... గ్రామాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం వాలంటీర్లు నియామకాన్ని చేపట్టింది. దీంతో వెంకటరావు గ్రామ వాలంటీర్ గా చేరిపోయాడు.
Read More ఆటోడ్రైవర్ భార్యపై కన్నేసిన వాలంటీర్.. అడ్డుగా ఉన్నాడని సైనెడ్ సూదులతో హత్య...
అయితే వాలంటీర్ వెంకటరావు గంజాయి కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. కానీ ఇతడు వాయిదాలకు హాజరుకాకపోవడంతో అతడి బెయిల్ రద్దుచేసి అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పాడేరు ఎస్సై తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి చింతగరువుకు వెళ్లి వాలంటీర్ ను అరెస్ట్ చేసారు. వెంకటరావును రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.