విజయవాడ టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తెలుగుదేశం సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా వైసీపీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

దీనిపై నాగుల్ మీరా స్పందించారు. తాను ప్రజారాజ్యం, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తిని కాదంటూ చురకలంటించారు. తెలుగుదేశాన్ని వదిలే ప్రసక్తే లేదని.. పార్టీ అభివృద్ధి కోసం చివరి వరకు పోరాటం చేస్తానని నాగుల్ మీరా స్పష్టం చేశారు. అంతకుముందు టీడీపీలో వర్గపోరుపై ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

టీడీపీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారంతా సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. మేయర్ పదవికి గద్దె రామ్మోహన్, బొండా ఉమ కుటుంబాల నుండి ఎవరు బరిలోకి దిగినా తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.

వర్గం లేనివారితో వర్గపోరు ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అందరూ ఓడిపోయిన టైంలో తాను విజయవాడలో ఎంపీగా గెలిచినట్టుగా ఆయన చెప్పారు.

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో  కేశినేని నాని మరొకరిని బరిలోకి దింపడాన్ని అదే పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ డివిజన్ లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం వచ్చిన నానిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకొన్నారు.