బెజవాడలో ఇటీవల కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పంపిన కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇకపై కొరియర్ సంస్థలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ డీసీపీ ప్రశాంతి హెచ్చరించారు.
ఇటీవల విజయవాడకు (vijayawada) చెందిన ఓ కొరియర్ సంస్థ (courier) ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ (drugs) జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని కొరియర్ సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి (dcp prasanthi) మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను కొరియర్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే నిందితులు విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేసేందుకు ప్రయత్నించారని డీసీపీ వెల్లడించారు. చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేశాడని ... అతనిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
చెన్నైలోని బర్మా బజార్‌లో పనిచేసే అరుణాచలాన్ని.. రూ.45 లక్షల విలువైన స్మగుల్డ్ గూడ్స్‌ను తీసుకెళుతుండగా నాలుగు బృందాలుగా ఏర్పడి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గోపిసాయి అనే వ్యక్తి ఆధార్‌ను ఫోర్జరీ చేసి అరుణాచలం (arunachalam) వాడుకున్నాడని తెలిపారు. గోపిసాయి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే అసలు బండారం బయటపడిందని ప్రశాంతి చెప్పారు. ఆ కేసులో ప్రశ్నించగా డ్రగ్స్ స్మగ్లింగ్ విషయాన్ని అంగీకరించాడని ఆమె పేర్కొన్నారు.
బెంగళూరు కస్టమ్స్ అధికారులు డ్రగ్స్ కేసును విచారిస్తుండడంతో.. చెన్నై నుంచి కొరియర్ చేస్తే దొరికిపోతారన్న ఉద్దేశంతో విజయవాడను ఎంచుకున్నాడని ప్రశాంతి తెలిపారు. ఇందులో మరో ఇద్దరి పాత్రపైనా విచారణ చేస్తున్నామని చెప్పారు. కొరియర్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై విదేశాలకు పంపించే కొరియర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని డీసీపీ ప్రశాంతి హెచ్చరించారు.
