అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి, బంధువులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద పది మందికి నోటీసులు జారీ చేశారు. రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ సమీప బంధువులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. 

ఈ నెల 9వ తేదీన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో  పది మంది కరోనా రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జేసీ శివశంకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ప్రభుత్వానికి ఇవాళ నివేదికను సమర్పించనుంది. 

also read:ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పనిచేయలేదు: స్వర్ణ ప్యాలెస్‌పై కమిటీ నివేదిక..!

రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్, స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. 

సరైన సౌకర్యాలు లేని కారణంగానే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని కమిటీ నివేదిక అభిప్రాయపడింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడ పాటించలేదని అధికారులు గుర్తించారు. కోవిడ్ సెంటర్ గా మార్చిన తర్వాత ఫైర్ సేఫ్టీ  అనుమతి తీసుకోలేదని ఫైర్ సిబ్బంది ప్రకటించారు.