విజయవాడ అభివృద్ధిని, జగన్, వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. బుధవారం విజయవాడలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులపై అధికారులు , కాంట్రాక్టర్లతో ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలో బెజవాడను అన్ని విధాలా అభివృద్ధి చేశామని ఆయన గుర్తుచేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటిన నుంచి బెజవాడ మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని కేశినేని ఆరోపించారు.

చిన్నపాటి వర్షానికే విజయవాడ మునిగిపోతుందని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని ఆయన తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు 80 కోట్ల దాకా డబ్బులు నిలిపివేశారని, ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలని నాని డిమాండ్ చేశారు.

అవి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదని.. సెంట్రల్ నుంచి నిధులు విడుదలయితే ఎందుకు ఆపుతున్నారని ఎంపీ ప్రశ్నించారు. జగన్, బొత్సల కమీషన్ కోసమే కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

అధికార పార్టీ నేతలకు కమీషన్‌లు ఇచ్చే వారికి నిధులు విడుదల చేస్తూ, కమీషన్‌లు ఇవ్వని వారికి నిధులు విడుదల చేయకపోవడం దుర్మార్గమని కేశినేని నాని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి గుడిలో లింగాన్ని దోచేయడం కాదని, స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

స్ట్రామ్ వాటర్ డ్రైన్ కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కేశినేని చెప్పారు. గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ... విజయవాడకు ఎంపీ కేశినేని రూ.500 కోట్లు తెచ్చారని గుర్తుచేశారు.

స్ట్రామ్ వాటర్ డ్రైన్ ద్వారా వర్షానికి మునుగుతున్న రోడ్లకు విముక్తి కలగనుందని గద్దె చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనులన్ని నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇవాళ్టీ వరకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా త్వరితగతిన పనులన్నింటినీ పూర్తి చేయమని చెప్పినట్లు ఆయన తెలిపారు.