అలా అయితే నా కూతురి నామినేషన్ వెనక్కి తీసుకొంటా: కేశినేని నాని సంచలనం
విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవికి తన కూతురు శ్వేత వద్దనుకొంటే నామినేషన్ ను వెనక్కి తీసుకొంటానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పారు.
విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవికి తన కూతురు శ్వేత వద్దనుకొంటే నామినేషన్ ను వెనక్కి తీసుకొంటానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన టీడీపీలో వర్గపోరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారంతా సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
మేయర్ పదవికి గద్దె రామ్మోహన్, బొండా ఉమ కుటుంబాల నుండి ఎవరు బరిలోకి దిగినా తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. వర్గం లేనివారితో వర్గపోరు ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అందరూ ఓడిపోయిన టైంలో తాను విజయవాడలో ఎంపీగా గెలిచినట్టుగా ఆయన చెప్పారు.
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో కేశినేని నాని మరొకరిని బరిలోకి దింపడాన్ని అదే పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ డివిజన్ లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం వచ్చిన నానిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకొన్నారు.