టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లను టార్గెట్ చేస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేసారు. 

విజయవాడ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షపార్టీల నాయకుల మధ్య మాటలయుద్దం మరింత ముదురుతోంది. ఇలా ఇటీవల టిడిపిని వీడి వైసిపిలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలో తాను పనిచేసిన పార్టీపై విమర్శలు గుప్పించారు. మరీముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని తాజాగా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విజయవాడలో తనను ఓడించడం ఎవరితరం కాదు ... చివరకు టిడిపి అధినేత చంద్రబాబే తనపై పోటీచేసినా గెలవలేరని కేశినేని నాని అన్నారు. ఈసారి గెలవడం కాదు భారీ మెజారిటీ సాధిస్తానని ... చంద్రబాబు పోటీచేసినా 3 లక్షల మెజారిటీ ఖాయమన్నారు. విజయవాడ లోక్ సభలో తనను ఓడించే దమ్మున్న నాయకుడెవరూ టిడిపిలో లేరని కేశినేని నాని అన్నారు. 

రాజకీయంగా తనది డిల్లీ స్థాయి ... అలాంటి  తనపై విమర్శలు చేసే స్థాయి కూడా లోకేష్ కు లేదని నాని అన్నారు. ఇప్పటివరకు అసలు గెలుపన్నదే ఎరగని లోకేష్ స్థాయి ఎంత అంటూ మండిపడ్డారు. ఈసారి కూడా వైసిపి చేతిలో లోకేష్ ఓఢిపోవడం ఖాయమని కేశినేని నాని అన్నారు. 

Also Read  రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదు..: టిడిపి ఎంపీ గల్లా జయదేవ్

ఇక టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన తర్వాత కూడా ఇలాగే లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు నాని.  అసలు ఏ హక్కు ఉందని లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించాడని నాని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు కొడుకుగా తప్ప లోకేష్ కు ఉన్న అర్హతలు ఏమిటని అడిగారు. ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన    నాయకుడు లోకేష్ అంటూ నాని మండిపడ్డారు. 

టిడిపి పార్టీ ఇచ్చిన అన్ని వనరులను వినియోగించుకున్నా మంగళగిరిలో లోకేష్  ఓటమిపాలయ్యాడు... కానీ పార్టీ నుండి ఎలాంటిది ఆశించకుండానే  తాను  రెండు దఫాలు విజయవాడ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించానని కేశినేని నాని  చెప్పారు. అందువల్లే ఎమ్మెల్యేగా తనను తాను గెలిపించుకోలేకపోయిన ఆఫ్ట్రాల్ నాయకుడు లోకేష్ చేసే పాదయాత్రలో పాల్గొనలేదని అన్నారు. పార్టీలో సీనియర్లకు కూడా లోకేష్ విలువ ఇవ్వడని ... అలాంటి వ్యక్తి వద్ద పనిచేయలేకే వైసిపిలో చేరుతున్నట్లు కేశినేని నాని తెలిపారు.