టీడీపీ అధిష్టానంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్‌దేవ్‌ను , అలాగే లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడిని, పార్టీ విప్‌గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు.

అయితే దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని.. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు.

తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాంటూ సూచించారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది.

మరోసారి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నా అంటూ నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అలాగే గత కొంతకాలంగా నాని బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. తనకు బీజేపీ అవసరం లేదని..  ఆ పార్టీలో చేరడం లేదని నాని స్పష్టం చేశారు.