ఇప్పటికే విజయవాడ ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కేశినేని నాని మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసిపిలోనే కాదు ప్రతిపక్ష టిడిపిలోనూ అధినాయకత్వం నిర్ణయాలపై కొందరు నాయకులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొనసాగుతోంది. ఈసారి ఎంపీ టికెట్ దక్కదని కన్ఫర్మ్ కావడంతో టిడిపిని వీడేందుకు సిద్దమయ్యారు కేశినేని నాని. అయితే టిడిపిలో కొనసాగినంతకాలం చంద్రబాబే తనకు బాస్ అంటూనే సెటైర్లు వేస్తున్నారు విజయవాడ ఎంపీ.
చంద్రబాబు తనను కాదనుకున్నారు... తాను చంద్రబాబును కాదనుకోలేదని కేశినేని నాని అన్నారు. అయితే ఇప్పటికీ తానింకా టిడిపిలోనే కొనసాగుతున్నాను కాబట్టి బాస్ చంద్రబాబు నిర్ణయాలను పాటించాల్సి వుంటుందన్నారు. బాస్ ఎప్పటికీ కరెక్టే... జర్మనీ ధ్వంసం అయ్యేంత వరకు హిట్లర్ కూడా కరెక్టే అంటూ కేశినేని నాని సెటైర్లు వేసారు. ఈ వీడియో వైసిపి సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇక ఇప్పటికే ఎంపీ పదవికి, టిడిపికి రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు.. అయినా ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని నాని అన్నారు. కాబట్టి మొదట డిల్లీకి వెళ్లి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ కు అందజేసిన మరుక్షణమే టిడిపికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించారు.
Also Read రేవంత్ రెడ్డి లాగే తన పరిస్థితి ... ఇప్పుడాయన సీఎం..: కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్
అంతకుముందు తనకు ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడంలేదని చంద్రబాబు కొందరు నాయకుల ద్వారా సమాచారం అందించినట్లు నాని సోషల్ మీడియా వేదికన ప్రకటించారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాలతో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తనను కలిసారని... ఇకపై టిడిపి దూరంగా వుండాలని అధినేత ఆదేశించినట్లు చెప్పారన్నారు. విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా వేరేవారికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట... కాబట్టి ఇకపై ఎక్కువగా టిడిపి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధినేత ఆదేశించారని తన వద్దకు వచ్చిన నాయకులు తెలియజేసారని కేశినేని నాని తెలిపారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు నాని స్వయంగా తెలిపారు.
అంతేకాదు తిరువూరులో టిడిపి నిర్వహించనున్న 'రా... కదలిరా' సభకు రావద్దని చంద్రబాబు ఆదేశించారని నాని తెలిపారు. ఆ సభ ఏర్పాట్లు చూసుకునే బాధ్యతలను వేరేవారికి అప్పగించారని... ఆ విషయంలో తనను కలగ చేసుకోవద్దని చెప్పారని తెలిపారు. అందువల్లే తన పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమం అయినా పాల్గొనడంలేదని నాని వెల్లడించారు.
ఇలా కేశినేని సోదరులు నాని, చిన్ని మధ్య వివాదం టిడిపికి నష్టం చేసేలా వుండటంతో అధిష్టానం అప్రమత్తమయ్యింది. నానిని బుజ్జగించాల్సిందిగా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను పంపింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కేశినేని భవన్‌కు వెళ్లిన రవీంద్ర కుమార్... నానితో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాజీనామా విషయంలో పునరాలోచించాలని ఎంపీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.
