ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి పరిస్థితి గతంలో రేవంత్ రెడ్డికి కూడా ఎదురయ్యిందని నాని అన్నారు. 

విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. ఆయనను కాదని తిరువూరులో జరిగే 'రా కదలిరా' సభ ఏర్పాట్ల బాధ్యత కేశినేని చిన్నికి అప్పగించింది టిడిపి అధిష్టానం. అంతేకాదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నానికి కాకుండా వేరేవారిని బరిలోకి దింపేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారట. ఈ విషయాన్ని స్వయంగా కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

తాజాగా తనను టిడిపి పక్కనబెట్టడంపై కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే టిడిపి తనను వద్దనుకుంది... అయినా ఆ పార్టీలో కొనసాగాలో వద్దో అభిమానులు, కార్యకర్తల నిర్ణయించాలని అన్నారు. వాళ్లు ఏం చెబితే అలా చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన బాస్ చంద్రబాబు నాయుడే... ఆయన చెప్పినట్లే వింటానని నాని తెలిపారు.

తిరువూరులో చంద్రబాబు పాల్గొనే 'రా... కదలిరా' సభకు వెళ్లబోనని నాని స్పష్టం చేసారు. తనవల్ల గొడవలు జరుగుతాయని టిడిపి నాయకత్వం భావిస్తోంది... అందువల్లే రావద్దని ఆదేశించినట్లున్నారని అన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... త్వరలోనే తీసుకుంటానని అన్నారు.
తినబోతూ రుచుల గురించి తెలుసుకోవడం ఎందుకు... త్వరలోనే తన నిర్ణయమేంటో తెలియజేస్తానని నాని మీడియాకు తెలిపారు. 

గతంలో తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డిపైనా ఇలాగే బుదరజల్లారని... ఇప్పుడు అతడు సీఎం అయ్యాడని నాని పేర్కొన్నారు. తాను అవినీతి, అక్రమాలు చేయలేదు... కాబట్టి ఎవరికీ భయపడనని అన్నారు. తనపై బురదజల్లేది ఎవరో తెలుసని... అవసరమైతే వాళ్లెవరో బయటపెడతానని నాని అన్నారు. 

Also Read విజయవాడ లోక్ సభ స్థానం కేశినేని చిన్నికే..! కేశినేని నానీకి నో చెప్పిన హైకమాండ్.. !

ఇప్పటికయితే టిడిపికి రాజీనామా చేయలేదని... అలా చేసివుంటే తన ఆఫీసులో జెండాలు మారివుండేవని నాని అన్నారు. మళ్లీ విజయవాడ నుండే ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. చంద్రబాబు నన్ను వద్దనుకున్నారు... తాను ఆయనను వద్దనుకోలేదని అన్నారు. తాను చంద్రబాబుకు ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొదటిసారి అత్యంత త్వరగా తనకు టికెట్ లేదని ప్రకటించారు... ఇందుకు చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతున్నానని నాని అన్నారు. నామినేషన్ ముందురోజువరకు నాన్చకుండా ముందే తేల్చడం సంతోషకరమని అన్నారు. ఇప్పడు తాను అర్జెంట్ గా డిల్లీకి వెళుతున్నానని... తిరిగివచ్చాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు. 

అంతకుముందు తనకు ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడంలేదని చంద్రబాబు కొందరు నాయకుల ద్వారా సమాచారం అందించినట్లు నాని సోషల్ మీడియా వేదికన ప్రకటించారు. ''అందరికీ నమస్కారం... నిన్న సాయంత్రం చంద్రబాబుగారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం మరియు మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించారని... ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని నాకు చెప్పమన్నారని తెలియచేసారు. అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని తెలియచేసారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను'' అంటూ ఫేస్ బుక్ ద్వారా నాని తెలిపారు.