అగ్నిప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవదహనమైన సంఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో గ్రామంలో విద్యుదాఘాతమైంది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఓ ఇంటికి నిప్పు అంటుకుంది.

ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి... ఇంట్లో నిద్రిస్తున్న గోపాలస్వామి(60) అనే వృద్ధుడు అగ్నికి ఆహుతయ్యాడు. గుడిసె కావడంతో పూర్తిగా కాలిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఇంటితోపాటు మరో 8 గుడిసెలకు కూడా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.