పట్టించుకోని బంధువులు... విజయవాడ జీజీహెచ్ మార్చురీలో గుట్టగుట్టలుగా శవాలు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో శవాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆసుపత్రిలో మార్చురీలో 50 మృతదేహాలు భద్రపరిచే అవకాశం వుండగా.. ప్రస్తుతం 81 మృతదేహాలు వచ్చి చేరాయి
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో శవాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆసుపత్రిలో మార్చురీలో 50 మృతదేహాలు భద్రపరిచే అవకాశం వుండగా.. ప్రస్తుతం 81 మృతదేహాలు వచ్చి చేరాయి. దీంతో మార్చురీ మొత్తం మృతదేహాలు గుట్టలుగా పడివున్నాయి.
మార్చురీలో పరిస్థితిపై వెలుగుచూసిన వీడియోలు సోషల్ మీడియాలో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మృతదేహాలు పేరుకుపోవడంపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
నగరంలోని అజిత్ సింగ్ నగర్‌లో ఖననాలు చేయాలని ఆదేశించారు. ఆరు మృతదేహాలు పట్టే రెండు ఫ్రీజర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని ఆదేశించారు.
Also Read:ఏపీలో కరోనా కరాళనృత్యం: మరోసారి 11 వేలు దాటిన కేసులు... సిక్కోలులో తీవ్రరూపు
కరోనాతో మృత్యువాత పడ్డ వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పజెప్పడానికి కృష్ణా జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని, గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్ సమన్వయముతో వ్యవహారించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.
ప్రభుత్వం కరోనా మరణాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి దురదృష్టవశాత్తు చాలా మంది మృత్యువాత పడటం విచారకరమని ఆయన అన్నారు. బంధువుల రాకకోసం రెండు నుంచి మూడు రోజులుగా మార్చురీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు.
బంధువులు రాకుంటే మృతదేహాలను కార్పోరేషన్‌కు అప్పగిస్తున్నారు జీజీహెచ్ సిబ్బంది. రెండు రోజుల్లో 135 మంది చనిపోతే నిన్నా, ఈ రోజు 80 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు అధికారులు.