గత శుక్రవారం ప్రత్యర్ధుల చేతిలో హత్యాయత్నానికి గురైన ఫైనాన్స్ వ్యాపారి దేవరపల్లి గగారిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించాడు. విజయవాడకు చెందిన గగారిన్ కొద్దినెలల క్రితం మద్దాలి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి ఆస్తి కొనుగోలు చేశాడు.

ఈ విక్రయంలో ప్రసాద్, ఆయన తనయుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గగారిన్ కొనుగోలు చేసిన ఆస్తిని ప్రసాద్ కుమారులు సురేశ్, సుధాకర్‌లు ఆక్రమించారు. దానిని దక్కించుకునేందుకు అడ్డుగా ఉన్న గగారిన్‌పై దాడి చేశారు.

దీంతో గగారిన్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. న్యాయం కోసం గగారిన్ కోర్టును ఆశ్రయించారు.. కోర్టు నుంచి గగారిన్‌కు అనుకూల తీర్పు వస్తుందనే ఉద్దేశ్యంతో దుండగులు ఆయన్ను అంతమొందించాలని నిర్ణయించారు.

దీనిలో భాగంగా గవర్నర్ పేట సమీపంలో కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గగారిన్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. పెట్రోల్ పోసి పారిపోయిన సుధాకర్, సురేశ్‌ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.