విజయవాడ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని చిన్నిలతో కలిసి లోకేష్ వద్దకు వెళ్లారు భవకుమార్.
విజయవాడ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని చిన్నిలతో కలిసి లోకేష్ వద్దకు వెళ్లారు భవకుమార్. వైసీపీని వీడేందుకు సిద్ధమైన ఆయన ఇప్పటికే వంగవీటి రాధ, చిన్ని, రామ్మోహన్‌లతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే భవకుమార్‌ను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ తదితర నేతలను రంగంలోకి దించింది.
లోకేష్‌తో భేటీ అనంతరం భవకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో కలిసి ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికి వైసీపీలో గౌరవం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని బొప్పన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వైసీపీలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరి సొంత నిర్ణయాలు వారివి తప్పితే పార్టీలో గౌరవం లేదని, అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని భవకుమార్ పేర్కొన్నారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటాననని .. అవకాశవాద రాజకీయాలు చేయటానికి, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి తెలుగుదేశంలో చేరడం లేదని బొప్పన తెలిపారు.
మరోనేత కేశినేని చిన్నీ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావటంతో వైసీపీ రాష్ట్రంలో మూడో ప్లేస్ కి పరిమితమైనా ఆశ్చర్యం లేదని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఖాళీ అవుతోందన్నారు. గేట్లు ఎత్తితే కృష్ణా నది వరదలా పోటెత్తినట్లు వైసీపీ నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చిన్నీ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై వారికి హామీ ఇవ్వలేకపోతున్నామని ఆయన వెల్లడించారు.
