విజయవాడ: ఆలయాల ముందు భక్తుల వద్ద భిక్షమెత్తుకొనే ఓ యాచకుడు సుమారు రూ. 8 లక్షలకు పైగా ఆయా దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. భక్తులు ఇచ్చిన సొమ్మును ఆలయాలకే విరాళంగా ఇచ్చాడు యాదిరెడ్డి అనే యాచకుడు.

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లికి  చెందిన యడ్ల యాదిరెడ్డి పదేళ్ల వయస్సులోనే విజయవాడకు వచ్చారు. తల్లిదండ్రులు లేని ఆయన విజయవాడకు వచ్చారు. విజయవాడలోనే ఆయన ఇంకా నివాసం ఉంటున్నాడు.నలభై ఏళ్ల పాటు విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా రిక్షా తొక్కి జీవనం కొనసాగించాడు. రైల్వే ఫ్లాట్ ఫారంపైనే ఆయన నిద్రించేవాడు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు. అప్పటి నుండి దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.

భోజనంతో పాటు వసతి, దుస్తులను ఆలయ పాలకవర్గం చూసేది. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను ఆయన బ్యాంకులో దాచుకొనేవాడు. అనారోగ్యం తీవ్రమైంది. బతికితే లక్ష రూపాయాలను సాయిబాబా ఆలయానికి ఇస్తానని ఆయన మొక్కుకొన్నాడు. ఆయన అనారోగ్యం నుండి కోలుకొన్నారు. తన మొక్కును తీర్చుకొన్నారు. సాయిబాబా ఆలయానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు.

ఈ ఆలయంలో దత్తాత్రేయ విగ్రహంతో పాటు ఆ విగ్రహానికి తొడుగులకు రూ. 20 వేలు, షిరిడీ ఆలయంలో అన్నదానానికి రూ. 20 వేలు ఇచ్చాడు. గురు పౌర్ణమి సమయంలో షిరిడీ ఆలయంలో నిర్వహించే అభిషేకం సమయంలో రూ. 1.08 లక్షలు ఇచ్చాడు. ఒక్కో కొబ్బరికాయకు ఒక్క రూపాయి చొప్పున రూ.1.08 లక్షలు చెల్లించాడు.

ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న గోశాల నిర్మాణానికి రూ. 3 లక్షలు విరాళమిచ్చాడు. కోదండ ఆలయంలో సీతారాములు, లక్ష్మణుడు హనుమంతులకు వెండి కిరిటాలు చేయించాడు. 

దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ. 1.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పటికి ఆయన సుమారు రూ. 8 లక్షలకు పైగా పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చాడు.యాచకుడిగా ఉన్నయాదిరెడ్డి భక్తులు ఇచ్చిన సొమ్మును దాచుకొని ఆలయాలకు విరాళంగా ఇచ్చాడు.