Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కోర్టులో వాడివేడి వాదనలు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పలు పిటిషన్‌లపై విచారణను ఏసీబీ కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. రిమాండ్‌లో వుండి కూడా చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని పొన్నవోలు పేర్కొన్నారు. 

vijayawada acb court adjourns hearing of tdp chief chandrababu naidu bail petition on tomorrow ksp
Author
First Published Oct 4, 2023, 5:32 PM IST

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పలు పిటిషన్‌లపై విచారణను ఏసీబీ కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.  తనకు కొన్ని డౌట్లు వున్నాయని రేపు మరోసారి వాదనలు వింటానని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని.. ఇవాళే వాదనలు వినాలని న్యాయస్థానాన్ని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది దూబే.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని.. అప్పటి ఆర్ధిక శాఖకు చెందిన అధికారి సునీత గుజరాత్‌లో అధ్యయనం చేసి వచ్చారని ప్రమోద్ కుమార్ దూబే వాదించారు. 

సునీత అధ్యయనం చేసిన తర్వాత సీమెన్స్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆధారాలు కూడా వున్నాయని దూబే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్కిల్ ప్రాజెక్ట్ ఎక్విప్‌మెంట్ ధరను నిర్థారించింది.. ‘‘కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ’’ అని , ఇందులో చంద్రబాబు లేరని తెలిపారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేపట్టారని.. రెండు రోజులు కస్టడీలోనూ విచారించారని, ఇప్పడు మళ్లీ కస్టడీ కావాలని సీఐడీ అడుగుతోందని దూబే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దూబే వాదించారు. 

Also Read: చంద్రబాబు అరెస్ట్ బాధాకరం.. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు: మంత్రి తలసాని

అంతకుముందు విచారణ సందర్భంగా సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదనే అంశంపై వాదించారు. రిమాండ్‌లో వుండి కూడా చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని పొన్నవోలు పేర్కొన్నారు. జైల్లో వుండగానే చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని.. ఇక బయటకు వస్తే ఇంకెంత ప్రభావం చేస్తారోనని పొన్నవోలు వాదించారు. 

అయితే స్కిల్ స్కాంలో చంద్రబాబుకు డబ్బు ముట్టిందన్న దానిపై ఆధారాలు వున్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పెండ్యాల శ్రీనివాస్, వాసుదేవ్ పార్థసానిలు విదేశాలకు పరారయ్యారని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుతో ఆర్ధిక లావాదేవీలు జరిపారు కాబట్టే వారు విదేశాలకు వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. 164 కింద వాంగ్మూలం ఇచ్చిన పీవీ రమేష్ మాట మార్చారని.. మీడియాలో మరో విధంగా చెబుతున్నారని పొన్నవోలు వాదించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios