హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో నగరి ఎమ్మెల్యే రోజా పేరు లేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. 

వైయస్ జగన్ తన కేబినెట్ లో మహిళలకు అవకాశాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. అయితే సినీ రంగానికి చెందిన రోజాకు కూడా జగన్ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని వారికి కూడా తగిన గుర్తింపు ఇష్తే బాగుంటుందని తాను చెప్పదల్చుకున్నట్లు ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా జగన్ రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు విజయశాంతి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకుండా ఐదేళ్ల కాలాన్ని గడిపేసిన కెసిఆర్... రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం మీద విమర్శలు వెల్లువెత్తాయని చెప్పుకొచ్చారు.

కెసిఆర్ కి మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేకపోవడం  మహిళలపై  ఆయనకున్న  ఉదాసీనతకు  నిదర్శనమన్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీ లో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్.జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు.

కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా?లేక గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.