కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 45 రోజులకే తమపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషం చిమ్ముతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి చంద్రబాబు పై మండిపడ్డారు.

‘‘సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారు చంద్రబాబు గారూ. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయింది. యూనిట్ 2.70కి వస్తుంటే 4.84 చెల్లించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారు?’’ అని ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో.. ‘‘కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్‌ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు.’’ అని పేర్కొన్నారు.