వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లపై విమర్శలు కురిపించారు. లోకేష్ ఒకరకమైన జబ్బుతో బాధపడుతున్నాడంటూ సెటైర్లు వేశారు.

తమ సామర్థ్యాన్ని ఎక్కువగా ఊహించుకోవడం అనే వ్యాధితో లోకేష్ బాధపడుతున్నాడని.. ఆ వ్యాధే అతనికి సమస్య గా మారిందంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. దీనిని డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్ అంటారని, లోకేశ్‌లో అభిజ్ఞా పక్షపాతం కూడా ఉందని ఎద్దేవా చేశారు. 

అనంతరం రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు నిలిపివేసిన విషయంపై కూడా స్పందించారు. వరల్డ్ బ్యాంకు నిధులు నిలిపివేయడానికి కుంభకోణాలే కారణమని దుయ్యబట్టారు. అమరావతి కుంబకోణాల పట్టు అని గ్రహించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కు మేలు చేసేలా ఉండటం, రుణం మంజూరు చేయకుండానే 92కిలోమీటర్ల రోడ్డుకు రూ.1872 కోట్లతో టెండర్ ఆమోదించడం పెద్ద కుంభకోణంగా వరల్డ్ బ్యాంకు దర్యాప్తులో వెల్లడైనట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

‘‘తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.’’ అని లోకేష్ ని ఉద్దేశించి సెటైర్ వేశారు.

‘‘ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందునే పవన విద్యుత్తును ఎక్కువ ధరకు కొన్నామంటూ చిట్టి నాయుడు మోకాలికీ  బోడి గుండుకు ముడిపెడుతున్నాడు. నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని  వాదిస్తారు. దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే  రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు.’’ అని మరో ట్వీట్ చేశారు.