తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. నందమూరి సుహాసినిని కూకట్ పల్లి అభ్యర్థిగా బరిలోకి దింపి.. హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు ఫసక్ చేశారని.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో సుహాసిని ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక విమర్శల వర్షం కురిపించారు.

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని అవమానించడానికే చంద్రబాబు  సుహాసినిని కూకట్ పల్లిలో పోటీకి దింపారని విజయసాయి అభిప్రాయపడ్డారు.  ఆ కుటంబం నుంచి ఇకపై ఎవరూ రాజకీయాల్లోకి వచ్చే సాహసం చేయకుండా  ఉండాలని..ఓడిపోయే సీటు ఇచ్చి బరిలోకి దింపి ఫసక్ చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఇతరులను బలి చెయ్యడం అలవాటేనని దుయ్యబట్టారు.

ఓటుకు నోటు కేసు చంద్రబాబు ఆయన బందిపోటు ముఠాను నిద్రకు దూరం చేస్తోందన్నారు. తెలంగాణాలో బాబు ఇంద్రజాలం పనిచేయక పోగా, ఆయన అనుంగు శిష్యుడు రేవంత్ ఎమ్మెల్యే పరాజయం పాలయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ కేసులో మిగిలిన విచారణ వేగవంతమైతే సరిగ్గా ఏపి ఎన్నికల ముందు జైలుకు వెళ్లడం తప్పదని చంద్రబాబు వణికిపోతున్నాడన్నారు.

‘‘ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని అనేవాడు.తనకేదైనా హాని జరిగితే ప్రజలంతా చుట్టూ వలయం కట్టి రక్షించాలని వేడుకున్నాడు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు వేగవంతమైతే కేసీఆర్ నుంచి అరెస్టు ప్రమాదం ఉందని మళ్లీ వేడుకోలు సభలు పెడతాడేమో’’ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.