ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేసిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై స్పందిస్తున్న టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

'జగన్ గారిని అప్రతిష్ఠ‌ పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు'  అని విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

'దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది? అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు' అని విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపి ప్రభుత్వం నుంచి ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు ప్రాణ హాని ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ గవర్నర్  కు లేఖ రాశారు. 

లోకసభ ఎంపీ రఘురామ కృష్ణమ రాజును మే 14వ తేదీన హైదరాబాదులో అక్రమంగా అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారని ఆయన అన్నారు.అదే రోజున ముసుగు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రఘురామపై దారుణంగా కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.  

జగన్ ప్రభుత్వం నుంచి రఘురామకు ప్రాణహాని: గవర్నర్ కు చంద్రబాబు లేఖ...

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణమ రాజును తన వై కేటిగరి భద్రత సమక్షంలో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, ఆ తర్వాత రమేష్ హాస్పీటల్ లో వైద్య పరీక్షలు చేి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.

కానీ పోలీసులు రఘురామను రమేష్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించకుండా మీడియా కళ్లు గప్పి దొడ్డిదారిన గుంటూరు సబ్ జైలుకు తరలించారని ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని కనీసం రఘురామ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదని ఆయన విమర్శించారు. 

గతంలో రఘురామకృష్ణమ రాజు స్వయంగా పోలీసు నుంచి, వైసీపి ప్రభుత్వం నుచి తనకు ప్రాణహాని ఉందని అనేక మార్లు చెప్పారని ఆయన అన్నారు. రఘురామకు ఉన్న ప్రాణహానిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వై కెటగిరీ భద్రతను కల్పించిందని ఆయన చెప్పారు.