ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై పలు విమర్శలు  చేశారు.

‘‘ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లిచ్చారు. పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కంట్రాక్లర్ల బిల్లులు చెల్లించారు.ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు.’’ అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

‘‘రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలి.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘రైతు భరోసా పథకం, ధరల స్థిరీకరణ నిధి వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. సీఎం వైఎస్ జగన్ దార్శనికత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రైతుల మోముల్లో చిరునవ్వులు పూస్తాయి. సేద్యం ఇక పండుగ అవుతుంది.’’ అంటూ జగన్ పై ప్రశంసలు కురిపించారు.