ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా ప్రస్తుతం ప్రజా వేదిక చుట్టూనే తిరుగుతోంది. దానిని కూల్చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా... తాజాగా  ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు.

‘‘నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు. ఇకపై సాధ్యం కాదు.’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

‘‘విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘అమ్మ ఒడి పథకం అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని సీఎం జగన్ గారు చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చింది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసింది.’’ అంటూ అమ్మ ఒడి పథకం గురించి మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

అనంతరం హోదా గురించి మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 303 మంది సభ్యులున్నారు. ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. అయినా హోదా కోసం పోరాడుతూనే ఉంటామని మా సీఎం గారు చెప్పారు. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడూ ఒకే మాట మీదున్నాం. చంద్రబాబులా హోదా సంజీవని కాదని ఎన్నడూ అనలేదు గదా?’’ అని ఎద్దేవా చేశారు.