కడప: ఆయన ఆ పార్టీకి ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడంలో దిట్ట. అంతేకాదు అధినేతను కష్టాల నుంచి గట్టెక్కించే వ్యక్తి. అలాంటి ట్రబుల్ షూటర్ కే ట్రబుల్స్ వస్తే పరిస్థితి ఏంటి...ఎవరికి చెప్పుకోవాలి..ఇంతకీ ఆ ట్రబుల్ షూటర్ ఎవరు..ఏ పార్టీకి చెందిన వ్యక్తో తెలుసుకోవాలను కుంటున్నారా ఇంకెవరు విజయసాయిరెడ్డి. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆయన ఇంటిపోరును మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారట. జగన్ ను ఎలాగైనా సీఎం చెయ్యాలని ఆయన దృష్టిసారిస్తుంటే ఆయన కొంపలో మెుదలైన కుంపటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. 

వివరాల్లోకి వెళ్తే విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకనాథరెడ్డి. విజయసాయిరెడ్డి భార్య సొంత సోదరుడు. ఈయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు కూడా. 

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గంలో కలిసి పోయింది. దీంతో కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆ తర్వాత వైసీపీలో చేరారు. 

విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం, టిక్కెట్ల వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో బావ సాయంతో టిక్కెట్ పొందాలని ద్వారకనాథరెడ్డి ఆశపడుతున్నారు. తనకు రాయచోటి టికెట్ ఇప్పించాలని బావపై ఒత్తిడి తెస్తున్నారట. 

టికెట్ ఇప్పించకపోతే తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. తన బావమరిది పక్కలో బల్లెంలా తయారవ్వడంతో ఏం చెయ్యాలో తోచడం లేదట విజయసాయిరెడ్డికి. రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. 

రాయచోటి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితులలో ఈయన ఒకరు. ఇద్దరూ హైదరాబాద్ లో క్లాస్ మేట్స్. అయితే జగన్ శ్రీకాంత్ రెడ్డిని పక్కనపెట్టే ఛాన్స్ ఉండదని విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. 

ద్వారకనాథ్ రెడ్డి కూడా శ్రీకాంత్ రెడ్డికి సమీప బంధువే కావడం గమనార్హం. రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ద్వారకనాథ్ రెడ్డికి మంచి పట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పై ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే టీడీపీ నేతలు టచ్ లోకి వచ్చారని కూడా తెలుస్తోంది. ద్వారకనాథ్ రెడ్డి విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు వద్ద కూడా జిల్లా నేతలు చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. ద్వారకనాథ్ రెడ్డి వస్తే రాయచోటి నియోజకవర్గంలో కానీ జిల్లా తెలుగుదేశం పార్టీలో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అతనిని పార్టీలోకి తీసుకోవాల్సిందిగా ముక్తకంఠంతో చంద్రబాబుకు సూచించారట జిల్లా నేతలు. 

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం నుంచి పిలుపు కూడా వచ్చిందని తెలుస్తోంది. ఈనెల 26న సైకిలెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం వస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి తలపట్టుకుంటున్నారట. ఇప్పటి వరకు తన భార్యతో బుజ్జగించేవాడినని ఇక పరిస్థితి చెయ్యిదాటి పోతుందని మదనపడుతున్నారట. 

ఇంటి విషయంలో విబేధించి బావ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇస్తే..సీటు విషయంలో విబేధించి విజయసాయిరెడ్డికి ఆయన బావమరిది షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మరి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. సోదరి మాట విని ద్వారకనాథ్ రెడ్డి వైసీపీలోనే ఉంటారా లేక తన రాజకీయ భవిష్యత్ కోసం సైకిలెక్కుతారా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.