Asianet News TeluguAsianet News Telugu

బిజెపిలోకి వారిని చంద్రబాబే పంపించారు: విజయసాయి

చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకు కూడా తెలియదా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని అడిగారు

Vijaya sai Reddy comments on defected TDP MPs
Author
Amaravathi, First Published Jun 22, 2019, 1:25 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడే వారిని బిజెపిలోకి పంపించారని ఆయన ఆరోపించారు. బిజెపిలో చేరిన నలుగురు ఎంపిల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. 

తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే చంద్రబాబు వారిని బిజెపిలోకి పంపించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలయకుండానే ఫిరాయిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసేవారని, ఇది 100 శాతం మ్యాచ్‌ ఫిక్సింగేనని ఆయన వ్యాఖ్యానించారు. 

నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసిందని ఎత్తిపొడిచారు. రెండేళ్ల నుంచి బీజేపీపై, మోడీపై దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న పంథాను అర్థం చేసుకుందని, ఇక నుంచి బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయని ఆయన అన్నారు.

సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిందని, 45 లక్షల ఎకరాలకు నీరందుతుందని, కానీ కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారని అన్నారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే చంద్రబాబుకు లేదని అన్నారు.

చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకు కూడా తెలియదా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని అడిగారు. ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసిందని ఆయన గుర్తు చేశారు. యూరప్ అనేది దేశం కాదని, 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసని విజయసాయి రెడ్డి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios