వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నారా లోకేష్ అక్రమ ధనార్జన రూ. 3 లక్షల కోట్లు ఉందని ఆయన అన్నారు. దాన్ని విదేశాల్లో దాచుకున్నా సంతృప్తి చెందకుండా రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశాలకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుతో కలసి ఆయన హాజరయ్యారు. 

టీడీపీ విధానాల వల్ల, నిర్లక్ష్యం కారణాంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని విమర్శించారు. నాలుగేళ్లయినా వంశధార రెండో దశ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. 

ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో హుద్‌హుద్‌ తుఫాన్‌లో ఇళ్లు కోల్పోయిన వారికి.. ఇళ్లు కేటాయించలేని అసమర్ధత టీడీపీ ఎమ్మెల్యేల సొంతమన్నారు. 

ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరగడంతో అవి బయటపడకూడదనే ఉద్దేశంతో పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.