పేదరికంపై గెలుపు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇప్పటికే సిఎం ఖాతాలో అనేక గెలుపులు
చంద్రబాబునాయడు ఖాతాలో మరో గెలుపు. కొత్తగా ఈ గెలుపు గోల ఏమిటి అనుకుంటున్నారా? ఈసారి గెలుపు ‘ పేదరికం’పై. ఇప్పటికే చంద్రబాబు హుద్ హూద్, తుఫాను, కరువు, దోమలపై గెలిచేశారు. తాజాగా బుధవారం సంక్షేమ రంగంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పేదరికంపై గులుపే ప్రధాన అంశం. సంక్షేమ కార్యక్రమాలను దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రాష్ట్రం మన ఏపినే అట.
తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతీ నెలా ప్రతీవ్యక్తికి 5 కిలోల బియ్యం, 1000 రూపాయల ఫించన్, 24 గంటల నిరంతర విద్యుత్, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు, నీటి భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా అందచేస్తున్నట్లు చంద్రబాబునాయడు ఘనంగా ప్రకటించారు.
చంద్రన్న ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తర్వాత రాష్ట్రంలో పేదరికం ఉండేందుకు అవకాశం లేదు కదా. సరే టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది ఈ రోజే అయినా రేపో మాపో పేదరికంపై కూడా గెలిచేసామని చంద్రబాబు చెప్పుకోకమానరు. మీడియా కూడా అదే విషయాన్ని డప్పేయక మానదు.
ఇక, చంద్రన్నబీమా, ఏడాదికి 5 లక్షల ఇళ్ళ నిర్మాణం, ఇంటింటికీ మరుగుదొడ్డి, నెలకు రూ 149కే ఇంటర్నెట్ కనెక్షన్, కనీస వేతనంగా రోజుకు రూ. 194 అందిస్తున్న రాష్ట్రం కూడా ఏపినే అట. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తర్వాత గెలుపు సిఎంకు కాక ఇంకెవరికి దక్కుతుంది. అందులోనూ, హుద్ హుద్, తుఫాను, కరువు, దోమలపై గెలిచేసిన తర్వాత పేదరికంపై గెలుపు చంద్రబాబుకు నల్లేరుపై నడకే..ఎవరికైనా అనుమానాలా?
