బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణంపై వెంకయ్య విచారం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు పరమ పదించారని తెలిసి తీవ్ర విచారం వ‍్యక్తం చేస్తున్నా. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత గల కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషి అభినందనీయం.

ఈరోజు ఉదయమే వారి కూతురు సింధుతో మాట్లాడి మాణిక్యాలరావుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశాను. ఇంతలోనే ఇలా జరగడం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఉప రాష్ట్రపతి ట్వీట్ చేశారు. 

కాగా తనకు కరోనా వచ్చిందని మాణిక్యాల రావు జూలై 4న స్వయంగా వెల్లడించారు. ఇటీవల పాజిటివ్‌గా నిర్థారణ అయిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ నేతతో సహా కాంటాక్ట్ వున్న వాళ్లకి పరీక్షలు  నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. మాణిక్యాల రావు మరణంతో ఏపీ బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.