Asianet News TeluguAsianet News Telugu

కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్య నాయుడు

భారతీయ కుటుంబ విలువలు ఎంతో ఉన్నతమైనవని, వాటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 

venkaiah naidu emptional speech on his mother in law
Author
Hyderabad, First Published Jan 10, 2019, 10:17 AM IST

భారతీయ కుటుంబ విలువలు ఎంతో ఉన్నతమైనవని, వాటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.  నెల్లూరు జిల్లా శ్రీరామపురంలో వారి అత్తగారు శ్రీమతి అల్లూరు కౌసల్యమ్మ దశదిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అత్తగారితో ఉన్న అనుబంధం గురించి వివరించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన తాను తాతగారి ఇంట్లో పెరిగానని, అమ్మమ్మతో పాటు అక్క అని పిలుచుకునే కౌసల్యమ్మ గారు తనకు తల్లి లేని లోటు తీర్చారని, ఆ తర్వాత కోరి మరీ అల్లుడుగా చేసుకున్నారని, అలా అక్క, అమ్మ, అత్తగా తనకు అవ్యాజమైన ప్రేమను పంచారని తెలిపారు. 

ఆ తర్వాత రాజకీయాల్లో కుటుంబానికి దూరంగా గడుపుతున్నప్పటికీ, తన భార్య పిల్లలకు పెద్ద దిక్కుగా ధైర్యాన్ని అందించారని, ఎమర్జెన్సీ రోజుల్లో తాను జైలుకు వెళ్ళినప్పుడు, ఇంక ఆయన తిరిగి రాడు అని అందరూ అంటూ ఉంటే, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కౌశల్యమ్మ పంచారని తెలిపారు. 


సాధారణంగా పండుగల సమయంలో పిండి వంటలు చేస్తుంటారని, కానీ తాను ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడే ఆమె పిండి వంటలు వండేదని, తాను ఇంటికి రావడం ఆలస్యమైనా, అర్థరాత్రైనా తాను వచ్చే దాక ఉండి, వేడిగా అన్నం వండి పెట్టే వారని గుర్తు చేసుకున్నారు. పెరుగు మీద మీగడను ప్రత్యేకంగా తనకు పెట్టే వారని, తమ సొంత పిల్లల కంటే తల్లి లేని వాడిననే ఉద్దేశంతో తన మీదే ఎక్కువ ప్రేమ కురిపించే వారని చెబుతూ ఉపరాష్ట్రపతి భావోద్వేగానికి లోనయ్యారు. 

తననే కాకుండా తన పిల్లలను, తన మనుమడు మనుమరాండ్రను అదే విధంగా పెంచారని, అవసరమైన ప్రతి సమయంలో కుటుంబానికి అండగా, పెద్ద దిక్కుగా ఉండే వారన్నారు. కుటుంబానికి ఇంత ఆసరాగా నిలబడడానికి ఆమె పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదని, ప్రతి ఒక్కరినీ తల్లి మనసుతో చూసే ఆమె వ్యక్తిత్వమే తమ కుటుంబానికి బాసటగా నిలిచిందని వివరించారు.

 ముఖ్యమైన రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి హాజరవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో మన సంప్రదాయాలు కాపాడుకోవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, అందరితో చర్చించి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. అలాగే తమ కుటుంబానికి అంత అండగా నిలబడిన ఆమెకు నివాళులు అర్పించడం తన కనీస ధర్మమనే ఉద్దేశంతో, ఓ వైపు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, రాజ్యసభ ఉపసభాధిపతికి, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, తన ధర్మాన్ని నిర్వర్తించానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios