విపక్షనేత జగన్ ప్రధానమంత్రిని కలవటంలో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంలో కొందరు ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో తనకు అర్ధం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు టిడిపిని తప్పుపట్టారు. ఎందుకంటారా? ప్రధానమంత్రి-జగన్ భేటీపై టిడిపికి చెందిన పలువురు మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు స్పందించారు. విజయవాడలో వెంకయ్యకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విపక్షనేత జగన్ ప్రధానమంత్రిని కలవటంలో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంలో కొందరు ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో తనకు అర్ధం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

పరిపక్వత లేని కొందరు ఈ విషయంలో అనవసరంగా మాట్లాడుతున్నారని కూడా వెంకయ్య ఎద్దేవా చేసారు. రాష్ట్రపతి ఎన్నికలో ఏ పార్టీ తమకు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో పొత్తు గురించి మాట్లాడుతూ, ఇప్పటికైతే పొత్తుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అప్పుడు ఆలోచిస్తామని చెప్పటం సర్వత్రా అనుమానాలకు దారితీసింది.

ఎందుకంటే, మొన్నటి వరకూ టిడిపి-భాజపాలు కలిసే ఉంటాయని చెప్పేవారు. రాష్ట్రంలో క్షేత్రస్ధాయిలో ఎదగటానికి కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పారు. వెంకయ్య-చంద్రబాబులు కలిసున్నంత వరకూ భాజపా ఎదగదని స్ధానిక భాజపా నేతలే ఎన్నోసార్లు కేంద్ర నాయకత్వానికి నివేదికలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో క్షేత్రస్ధాయిలో బలపడతాం, 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అప్పుడే ఆలోచిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.