దేశ రాజకీయాల్లో భాజపా ఎదిగింది ఎలా? బాబ్రి మసీదు కూలగొట్టటానికి ముందు ఆ పార్టీ పరిస్ధితి ఏమిటి? తర్వాత పరిస్ధితి ఏమిటన్న విషయం ఎవరినడిగినా చెబుతారు.

భారతీయ జనతా పార్టీ పరిస్ధితి గురువింద గింజ లాగ తయారైంది. అధికారం ఉందికదాని, మీడియా దన్నుతో కేంద్రమంత్రి వెంకయ్య కాంగ్రెస్ గురించి మాట్లాడిన మాటలు అదే విషయాన్ని స్పష్ట చేస్తున్నాయి. కాంగ్రెస్ గురించి వెంకయ్యనాయడు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆయన చెప్పింది నిజమే కావచ్చు. అయితే, తన పార్టీ కూడా అదే రాజకీయాలు చేసింది, చేస్తోందన్న విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా మరచిపోయినట్లున్నారు.

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అన్నింటికీ చెడిందని వెంకయ్యనాయడు చెప్పటం విడ్డూరంగా ఉంది. భాజపాను అణిచివేయాలని నెహ్రూ వద్ద నుండి చాలా మంది ప్రయత్నాలు చేసారట. దేశంలో కులం, మతం, ప్రాంతం, భాష, నీరు అని జనాన్ని సులభంగా కూడగట్టవచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల పాటు అదే పని చేసిందని విమర్శించారు. అందువల్లే ఇపుడు కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడైందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ గురించి 40 ఇయర్స్ ఇండస్ట్రీ వెంకయ్య అనుభవంతో చెప్పిందాన్ని ఎలా కాదనగలం. అయితే, ఇక్కడే కొన్ని సందేహాలు వస్తాయి. అసలు దేశ రాజకీయాల్లో భాజపా ఎదిగింది ఎలా? బాబ్రి మసీదు కూలగొట్టటానికి ముందు ఆ పార్టీ పరిస్ధితి ఏమిటి? తర్వాత పరిస్ధితి ఏమిటన్న విషయం ఎవరినడిగినా చెబుతారు. బాబ్రి మసీదు కూల్చివేత పేరుతో దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది ఎవరు? దేశం మొత్తం మీద మతకలహాలు పెరిగిపోవటానికి కారణమెవరు? ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి లబ్దిపొందింది ఎవరో కూడా వెంకయ్య చెబితే బాగుంటుంది.

అలాగే, గుజరాత్ లో నరేంద్రమోడి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోద్రా అల్లర్లలో వదంలాది ముస్లింలను ఊచకోత కోసిందెవరు? ఇప్పటికీ రామమందిర నిర్మాణం పేరుతో ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నదెవరు? యూపిలో కాంగ్రెస్ సైకిల్ సీటులో(ఎస్పి) కూర్చోవాల్సిన పరిస్ధితి దాపురించిందని కాంగ్రెస్ ను వెంకయ్య ఎద్దేవా చేసారు. కాంగ్రెస్- ఎస్పీ మద్య పొత్తు కుదరటం భాజపాకు ఏమాత్రం మింగుడుపడని వ్యవహారం. కాబట్టే వెంకయ్య అంత వెటకారంగా మాట్లాడారు.

ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవటమే నేరమైతే, జమ్ము-కాశ్మీర్ లో భాజపా పరిస్ధితి ఏమిటి? వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే పిడిపితో దేశభక్తి విషయంలో తమకు మాత్రమే పేటెంట్ హక్కులున్నట్లు చెప్పుకునే భాజపా ఏ విధంగా అధికారం పంచుకుంటోంది? ఏపిలో టిడిపితో అధికారం ఎందుకు పంచుకుంటున్నట్లు? అందుకే భాజపాది గురువింద వ్యవహారం. ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారం అందుకోవటమే. అది కాంగ్రెస్ అయినా, భాజపా అయినా ఒకటే.