జనసేనాని దుమ్ము దులిపేసిన పద్మ

జనసేనాని దుమ్ము దులిపేసిన పద్మ

వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దుమ్ము దెలిపేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతీ వైఫల్యంలోనూ పవన్ కు వాటా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు పవన్ కు లేదంటూ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రతీ అరాచకానికి, అన్యాయానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు, నేరాల్లో పవన్ కూడా భాగస్వామే అంటూ ధ్వజమెత్తారు. కొత్తగా పెట్టుకున్న పార్టీలు అధికారపార్టీ వైఫల్యాన్ని ప్రశ్నించటం చూసాం గానీ పవన్ విచిత్రంగా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు స్క్కిప్ట్ ప్రకారమే పవన్ నడుచుకుంటున్నారనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావలన్నారు.

పోయిన ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటిచేసినందున పవన్ కూడా ప్రభుత్వం చేసిన పాపాల్లో భాగస్వామ్యం ఉందన్నారు. అందుకు పవనే ప్రజలకు సమాధానాలు చెప్పుకోవాలని స్పష్టం చేసారు. విభజన హామీలు అమలు కాకపోవటానికి, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం కాకపోవటానికి పవన్ కూడా బాధ్యుడేనంటూ దులిపేసారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబుపై పవన్ ఎందుకు నోరెత్తటం లేదని ప్రశ్నించారు.

చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ అరాచకాలు కనిపించలేదా అంటూ నిలదీసారు. రైతుల ఆత్మహత్యలు, నారాయణ విద్యాసంస్ధల్లో విద్యార్ధుల బలవన్మరణాలు ఎందుకు కనబడలేదని పవన్ ను ప్రశ్నించారు. వైసిపి ఎంఎల్ఏలను సంతలో పశువులను కొన్నట్లు రూ. 30 కోట్లకు కొంటున్న విషయం పవన్ కు కనబడలేదా అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కోసమే తాజాగా పవన్ రంగంలోకి దిగారని పద్మ ఆరోపించారు. అధికారం ముఖ్యంకాదు అన్న మాటల్లోనే అర్ధం తెలిసిపోతోందంటూ ఎద్దేవా చేసారు. తమ పార్టీకి ప్రజల మద్దతు కావాలే కానీ పవన్ మద్దతు అవసరం లేదని పద్మ స్పష్టం చేసారు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos