వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినీనటుడు ప్రభాస్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ స్పందించారు. షర్మిలపై టీడీపీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

పోలీసులకు షర్మిల చేసిన ఫిర్యాదుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అండగా ఉంటానని కాకుండా ఎదురుదాడికి దిగటం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారమంతా బాబుకు తెలియదా అని వాసిరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో అసలు దీని వెనుకున్న వారు బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలే టీడీపీ నేతల ఇళ్లలోని ఆడవారికి జరిగితే ఇలాగే చేస్తారా అని ఆమె ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో మహిళలకు న్యాయం చేసిన ఘటన ఒక్కటైన ఉందా..? విలువలు, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ మైకుల ముందు చంద్రబాబు ఊదరగొడుతారని, కానీ ఆయన పాటించరని పద్మ ఆరోపించారు.

చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌పై దాడి జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరగకుండానే... సీఎం, డీజీపీ మాట్లాడిన తీరు శోచనీయమన్నారు.