మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ వైసీపీ నేత కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు గురువారం నాడు మైలవరం పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. 

వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించాలని  కోరుతూ ఎస్ఐ‌కు లంచం ఇచ్చేందుకు వైసీపీ కార్యకర్త రామారావు ప్రయత్నించారని పోలీసులు ఫిర్యాదు చేశారు.

అయితే వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులను బనాయించారని వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఒత్తిడుల కారణంగానే  వైసీపీ కార్యకర్తలపై కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు. 

ఈ కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు తప్పుడు కేసులు బనాయించినందుకు క్షమాపణలు చెప్పాలని  వైసీపీ డిమాండ్ చేస్తోంది.

వైసీపీ నేతల ఆందోళనతో  మైలవరం పీఎస్ వద్ద  ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. పోలీసులు కేసులు పెట్టడం వెనుక మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు హస్తం ఉందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.