కృష్ణా జిల్లాలోని మైలవరం అసెంబ్లీ సీటు కోసం వైసిపిలో వర్గపోరు సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కాకుండా జోగి రమేష్ ఇక్కడినుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

విజయవాడ: అధికార వైసిపి పార్టీ (ysrcp)లో లుకలుకలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం వున్న పార్టీలో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది. కొన్ని నియోజకవర్గాల కోసం వైసిపి నాయకుల మధ్య వర్గపోరు సాగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandrareddy) తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. 

ముఖ్యంగా కృష్ణా జిల్లా (krishna district) వైసిపి శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం (mailavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (vasanta krishna prasad), పెడన (pedana) ఎమ్మెల్యే జోగి రమేష్ (jogi ramesh) వర్గాల మధ్య పోరు సాగుతున్న విషయం వైసిపి అధిష్టానం దృష్టికి వెళ్లడంతో మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. 

ప్రస్తుతం మైలవరం నియోజకవర్గానికి వసంత కృష్ణ ప్రసాదే ఎమ్మెల్యే అని... భవిష్యత్తులో కూడా ఆయనే పార్టీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా స్థానిక వైసిపి నాయకులెవరైనా పనిచేస్తే అది పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టేనని అన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని... పార్టీపరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. 

read more జగన్ ఢిల్లీ పర్యటన : బెయిల్ అంశంపై మాట్లాడడానికే మోదీతో భేటీ..రఘురామ వ్యంగ్యాస్త్రాలు

ఇక జోగి రమేష్ ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా వున్నారు... భవిష్యత్ లోనూ ఆయన అక్కడే కొనసాగుతారని మంత్రి వెల్లడించారు. ఆయన నియోజకర్గం మారబోరని... అలాంటి ప్రచారాలు జరిగినా నమ్మవద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసిపి శ్రేణులకు సూచించారు.

ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఊరుకోమని సొంత పార్టీ నాయకులను మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడమని అన్నారు. అందరూ కలిసి మెలిసి పని చేస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాబట్టి అనవసర వివాదాలకు దారితీసే చర్యలు ఉపసంహరించాలని వైసిపి నాయకులు, కార్యకర్తలకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. 

read more దుర్గి ఘ‌ట‌న‌ను టీడీపీ రాజ‌కీయం చేస్తోంది - ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి

ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జోగి రమేష్ ది నిజానికి మైలవరం నియోజకవర్గమే. ఆయన 2014లో మైలవరం నియోజకవర్గం నుండే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే 2019లో రాజకీయ సమీకరణలను దృష్టిలో వుంచుకుని జోగి రమేష్ ను పెడనకు పంపించి మైలవరం నుండి వసంత వెంకట కృష్ణప్రసాద్ ను వైసిపి అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇలా మైలవరంలో వసంత, పెడనలో జోగి రమేష్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

అయితే మైలవరంలో జోగి రమేష్ వర్గానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మధ్య గ్యాప్ వున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఇదికాస్తా బయటపడింది. దీంతో తిరిగి జోగి రమేష్ మైలవరంకు రావాలని ఆయన వర్గం కోరుతోంది. 

ఇలా వైసిపి పార్టీ ఎమ్మెల్యేల వర్గాల అంతర్గత పోరు అధిష్టానం దృష్టికి వెళ్ళడంతో సీఎం జగన్ గతంలోనే సీరియస్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కూడా ఎమ్మెల్యేలు వసంత, జోగి రమేష్ మధ్య విబేధాలు సృష్టించవద్దని హెచ్చరించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.