విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామిదేవస్థానం ఇంద్రకీలాద్రిపై వరుణయాగం చేపట్టింది. గురువారం ఉదయం వరుణయాగం కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఈవో కోటేశ్వరమ్మలు ప్రారంభించారు. 

ఇంద్రకీలాద్రిపై గణపతిపూజతో వరుణయాగాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ వరుణయాగం ఐదు రోజులపాటు జరగనుంది. దుర్గా ఘాట్‌లో ప్రారంభమైన ఈ వరుణయాగంలో వేద విద్యార్థులు, అర్చకులు వరుణ జపం చేపట్టారు. 22 వరకు ఉదయం 6నుంచి 8గంటల మధ్య దేవస్థానం వేద విద్యార్థులు, రుత్వికులు వరుణజపం, వరుణానుపాక, శతానువాక, విరాటపర్వ పారాయణ చేయనున్నారు. 

23న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మండపారాధనలు, దేవతామంత్ర హవనాలను రుత్వికులు నిర్వహించనున్నారు. 24న ఉ దయం 6 నుంచి 11 గంటల వకు కృష్ణా జలంతో మల్లేశ్వరస్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేయనున్నారు. 

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగం తలపెట్టినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు సైతం ఈ యాగంలో పాల్గొనవచ్చని మంత్రి సూచించారు. 

ఇప్పటికే వర్షాలు కురవాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు వర్షాలు కురవని నేపథ్యంలో వరుణ దేవుడ్ని కరుణించాలంటూ యాగం చేస్తున్నట్లు తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్రాష్ట్రం సశ్యాస్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.