టిడిపి నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ ఏపీ డిజిపికి వర్ల రామయ్య లేఖ రాసారు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రామయ్య లేఖ రాసారు. 

ఎన్నిసార్లు లేఖలు రాసినా పాదయాత్రగా ప్రజల్లోకి వెళుతున్న లోకేష్ కు రక్షణ కల్పించడంలో పొలీసుల తీరు మారడంలేదని రామయ్య డిజిపికి తెలిపారు. తానే స్వయంగా అనేక లేఖలు రాసినా పోలీస్ బందోబస్తు పెంచడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు. గత రెండ్రోజులుగా (సెప్టెంబర్ 2,3 తేదీల్లో) లోకేష్ పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోందని... ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికి పోలీసులు తగిన రక్షణ చర్యలు చేపట్టలేదని అన్నారు. దీంతో నిడమర్రు మండలం నుంచి మందలపర్రు చేరుకున్న సమయంలో వైసీపీ గూండాలు పాదయాత్రపై దాడిచేసారని డిజిపికి తెలిపారు రామయ్య.

ఒక్కసారిగా లోకేష్ పాదయాత్రలోకి దూసుకొచ్చిన వైసిపి గూండాలు వాహనాలపై దాడి చేసారని రామయ్య అన్నారు. లోకేష్ వెంట నడిచేందుకు వచ్చిన ప్రజలను బూతులు తిడుతూ బెదిరించారని అన్నారు. ఇలా శాంతియుతంగా సాగుతున్న యువగళం పాదయాత్రలో అలజడి సృష్టించారంటూ రామయ్య డిజిపి దృష్టికి తీసుకెళ్లాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఆపలేదని... దీన్ని బట్టే పోలీసుల వైఫల్యం స్పష్టంగా బయటపడిందని అన్నారు. 

Read More విజయవాడ పోలీస్ స్టేషన్లో లోకేష్ పై కంప్లైంట్... అరెస్టుకు ముస్లిం నాయకుడి డిమాండ్

మాజీ మంత్రి, ఓ జాతీయ పార్టీ నాయకుడు లోకేష్ కు రక్షణ కల్పించకపోగా పోలీసుల పర్యవేక్షణలోనే పాదయాత్రపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని రామయ్య ఆందోళన వ్యక్తం చేసారు. మందలపర్రులోని పాదయాత్ర మార్గంలోకి వైసీపీ గూండాలను అనుమతించాల్సిన అవసరం ఏమిటి? పోలీసుల తమ విధినిర్వాహణ సక్రమంగా చేయకుండా నిస్తేజంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అని రామయ్య ప్రశ్నించారు. 

లోకేష్ పాదయాత్ర మార్గంలో వైసీపీ మద్దతుదారులు రెచ్చగగొట్టేలా ప్లెక్సీలు కట్టేందుకు పోలీసులు ఎందుకు అనుమతిస్తున్నారంటూ డిజిపికి రామయ్య ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసిపి గూండాలు పాదయాత్రలో అలజడి సృష్టించకుండా శాంతియుతంగా జరిగేలా తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డిజిపిని కోరారు. అలాగే మందలపర్రులో పాదయాత్రపై దాడిచేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. విధి నిర్వహణలో విఫలమై మందలపర్రులో పాదయాత్రపై దాడికి అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు టిడిపి నేత వర్ల రామయ్య.