చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు లోకేష్ అరెస్ట్ కు కూడా రంగం సిద్దమైందంటూ దుష్రచారం చేస్తున్నారని టిడిపి నేత వర్ల రాామయ్య ఆరోపించారు.
విజయవాడ : ఇప్పటికే మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం చేస్తోందని వర్ల రామయ్య అన్నారు. లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్దమైందంటూ లీకులు వదిలి టిడిపి శ్రేణులనే కాదు ప్రజలనూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం రాజకీయకక్ష కోసం పోలీసులను వాడుకుంటోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని రామయ్య ఆందోళన వ్యక్తం చేసారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు సమయం వుంది... ఆలోపు ప్రతిపక్షాలు లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోందన్నారు. అందుకోసమే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయించడానికి జగన్ తహతహలాడుతున్నాడని వర్ల రామయ్య ఆరోపించారు.
అక్రమ అరెస్టుల ద్వారా ప్రతిపక్షాలను చెల్లాచెదరు చేయాలని చూస్తున్నాడని రామయ్య అన్నారు. తన రాజకీయాల కోసం సీఎం జగన్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నాడని.. పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నాడని అన్నారు. గత 10 రోజులుగా పోలీసులకు సెలవులను రద్దు చేసారని... స్టాండ్ బైలో పెట్టి రోడ్లపైనే ఉంచుతున్నారన్నారని రామయ్య తెలిపారు.
Read More రెండేళ్లు సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ తరపు న్యాయవాది
వినాయక చవిత పండగవేళ ఏపీ ప్రజలు దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి కూడా పోలీసుల పర్మిషన్లు కావాలా? అని రామయ్య ప్రశ్నించారు. ఈ దుర్మార్గ పాలనలో వ్యాపారస్తులు షాపులు తెరచి బిజినెస్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో ఉద్యోగులు సైతం పాలనా నిర్ణయాలు తీసుకోడానికి... ఫైళ్లపై సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు.
ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను జగన్మోహన్ రెడ్డి తన స్వార్ధం కోసం అల్లకల్లోలం చేస్తున్నాడు... ఇది సరైన పద్దతి కాదని రామయ్య హెచ్చరించారు. అధికారమే శాశ్వతం అనుకుని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిసిపోయారు... మీరెంత జగన్? అంటూ వర్ల రామయ్య హెచ్చరించారు.
