చిత్తూరుకు చెందిన దళిత మహిళ పోలీసుల కష్టడీలో చిత్ర హింసలకు గురయ్యారని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కు లేఖలు రాశారు. 

చిత్తూరు దళిత మహిళ ఉమా మహేశ్వరి (uma maheshwari) ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (national human rights commission), జాతీయ ఎస్సీ కమిషన్ (national sc commission)కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (varla ramaiah) లేఖలు రాశారు. ఘ‌ట‌న‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, హౌస్ అరెస్టులకు కేంద్రంగా మారింద‌ని ఆరోపించారు. అమాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రులు అరెస్టులు చేసి చిత్ర‌హింస‌లకు గురి చేస్తున్నార‌ని అన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఉమామహేశ్వరి అనే దళిత మహిళపై పట్టణ పోలీసుల కస్టోడియల్ వేధింపులే దీనికి నిద్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని ఆరోపించారు. చేయని దొంగతనాన్ని ఆమె మోపార‌ని ఆయ‌న అన్నారు. రెండు రోజులపాటు స్టేషన్‌కు పిలిపించి ఉమామహేశ్వ‌రిని చిత్రహింసలకు గురి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఉమామహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నార‌ని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య తెలిపారు. వేణుగోపాల్ రెడ్డి ఇంట్లోని రూ. 2 లక్షలు పోవ‌డంతో ద‌ళిత మ‌హిళే దొంగ‌త‌నం చేసింద‌ని భావించి, ఆమెను చేయని నేరాన్ని ఒప్పుకోవాల‌ని పోలీసులు చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. ఆ త‌రువాత ఆ దొంగ‌తనం ఉమామ‌హేశ్వ‌రి చేయ‌లేద‌ని, వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఉన్న డ‌బ్బును ఆమెకు తెలిసిన వారే తీసుకున్నార‌ని తెలిసింద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. అయితే ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ స‌ద‌రు మ‌హిళ‌ను పోలీసు స్టేష‌న్ లో హింసించ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఉమామ‌హేశ్వ‌రి ఘ‌ట‌న‌లో పోలీసులు పూర్తిగా మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించార‌ని వ‌ర్ల రామ‌య్య లేఖ‌లో ఆరోపించారు. అంతే కాదు అరెస్టు, కస్టడీయల్ చిత్రహింసలకు సంబంధించి గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పోలీసులు పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్, జాతీయ ఎస్సీ క‌మిష‌న్ విచార‌ణ జ‌రిపి బాధ్యుల‌పై క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాన‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే...
చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఉమామ‌హేశ్వ‌రి అనే ద‌ళిత మ‌హిళ ఇంట్లో పనిమనిషిగా ప‌ని చేస్తున్నారు. అయితే ఈ నెల 18వ తేదీన ఆ ఇంట్లో రూ.2 ల‌క్ష‌ల రూపాయిలు మాయం అయ్యాయి. దీంతో ఉమామ‌హేశ్వ‌రి ఈ దొంగ‌తనం చేసి ఉంటుంద‌ని ఆమెపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. అయితే విచారణ పేరుతో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేరం రుజువు కాకపోవడంతో ఆమెను విడిచిపెట్టారు. ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇలాంటి ఘ‌ట‌నే గతేడాది తెలంగాణ‌లోనూ జ‌రిగింది. ఓ చ‌ర్చ్ ఫాధ‌ర్ ఇంట్లో దొంగ‌త‌నం చేసింద‌న్న కార‌ణంగా మ‌రియ‌మ్మ అనే ద‌ళిత మ‌హిళ‌ను పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది.