మరో క్రైస్తవుడి చేతికే దేవాలయాలపై దాడుల కేసా?: వర్ల రామయ్య సీరియస్
కేసుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐకి ఇవ్వాలని అందరూ గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి ఆ దిశలో ఆలోచించకుండా రాష్ట్ర సీఐడికి అప్పగించడం బాధాకరమన్నారు వర్ల రామయ్య.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హైందవ దేవాలయాలపై దాడుల విషయంలో చాలా చైల్డిష్(పిల్లతనం)గా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడు, హోంమంత్రి క్రైస్తవురాలు, రాష్ట్ర డీజీపీ క్రైస్తవుడని రాష్ట్ర హైందవ లోకమంతా గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి చాలా నిర్లక్ష్యంగా ఈ దేవాలయాలపై దాడుల దర్యాప్తును కూడా ఓ క్రైస్తవుడి నాయకత్వంలోని సీఐడి విభాగానికి అప్పగించారని ఆరోపించారు.
''కేసుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐకి ఇవ్వాలని అందరూ గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి ఆ దిశలో ఆలోచించకుండా, సమస్య తీవ్రతను పరిగణించకుండా రాష్ట్ర సీఐడికి అప్పగించడం బాధాకరం. అందులోనూ రాష్ట్ర సీఐడికి నాయకత్వం వహిస్తున్న అధికారి కూడా క్రైస్తవుడే. ఇంతమంది క్రైస్తవ పెద్దల అజమాయిషీలో హైందవ దేవాలయాలపై దాడులకు కారకులైన ముద్దాయిలు దొరుకుతారా? 4 పిల్లుల మధ్య ఎలుక తప్పించుకుపోయినట్లు తప్పించుకుంటారా?'' అని అనుమానం వ్యక్తం చేశారు.
read more రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్:జగన్ సంచలనం
''ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర సీఐడి దర్యాప్తు చేయాలనుకుంటే క్రైస్తవుడైన ఆ విభాగపు అధిపతిని బదిలీ చేసి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలి. అంతేగానీ క్రైస్తవుడైన సీఐడి అధిపతి చేతిలో హైందవ దేవాలయ విధ్వంసకులు పట్టుబడతారన్న నమ్మకం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కొంచెం ఆలోచనతో, అవగాహనతో సమస్య తీవ్రతను, మత సామరస్యం కాపాడడం దృష్టిలో ఉంచుకుని సీఐడికి దర్యాప్తు ఇస్తే ఉన్నతాధికారిని బదిలీ చేసి వేరొకరిని నియమించాలి. ఈ గొడవంతా లేకుండా ప్రజాభీష్టం మేరకు ఈ కేసులన్నీ సీబీఐకి అప్పగించి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి'' అని రామయ్య సూచించారు.