అనంతపురం:  అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ధర్మవరంలోని తన కార్యాలయంలో సూరి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. 

టీడీపీకి రాజీనామా చేస్తూ లేఖను సూరి చంద్రబాబుకు లేఖ పంపినట్టు తెలుస్తోంది.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. అనంతపురం జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న నేతలు కొందరు ఈ విషయాన్ని ఖండించారు.

వరదాపురం సూరి టీడీపీని వీడుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిలు ఆయనతో మంతనాలు జరిపినట్టుగా చెబుతున్నారు.

నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాలని సూరి భావిస్తున్నట్టుగా సమాచారం.వరదాపురం సూరి పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించినట్టుగా సమాచారం. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వరదాపురం సూరి చంద్రబాబును కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కూడ సూరి దూరంగా ఉన్నారు.

అనారోగ్య కారణాలతోనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత ఏపీ రాష్ట్ర ఇంచార్జీ రామ్ మాధవ్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సూరి చర్చించినట్టు సమాచారం. అన్ని కుదిరిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రమే ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.