విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విజయవాడలో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. వంగవీటి రాధా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంపై వంగవీటి రాధా నోరు విప్పడం లేదు. ఇటీవల ఆయన హైదరాబాదులో కేంద్ర మంత్రి ఒకరిని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. 

గత కొంత కాలంగా ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన తర్వాత ఆయన పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. గతంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ)కి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు పదవి దక్కుతుందని భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. 

తనకు నచ్చిన సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో అలిగిన వంగవీటి రాధా వైసీపీ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపిలో ఉన్నారు. తనకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించడం లేదని అలిగి ఆయన వైసీపీ నుంచి తప్పుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ కోసం ఆయన జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ యాగాలు కూడా చేశారు. అయితే, వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆయన కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. 

ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన రెండుసార్లు కలిశారు. కానీ ఆ పార్టీలో చేరలేదు. గతంలో ఆయన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన పనిచేశారు.