గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకం పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు టోకరా వేశారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కనీసం రూపాయి కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకుని అరిచి... ఈ రోజు రూ.27వేల కోట్ల రుణాలు అంటున్నారని గుర్తుచేశారు. ఆ రుణాలు ఎవరి హయాంలో ఇచ్చారో జగన్ రెడ్డి సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. 

''టీడీపీ హయాంలో రెండేళ్లలో పసుపు-కుంకుమ పథకం ద్వారానే ఏకంగా రూ.18,500 కోట్లు చెల్లిస్తే జగన్ రెడ్డి నాలుగేళ్లలో రూ.27వేల కోట్లు మాఫీ అంటున్నారు. ఆ దామాషా ప్రకారం ఎవరు ఎక్కువ సాయం చేస్తున్నట్లు? రుణాలు తీసుకుని ఇంకా చెల్లించని వారికి మాత్రమే ఈ ఆసరా వర్తిస్తుంది. కానీ టీడీపీ హయాంలో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు ఏడాదికి రూ.10వేల చొప్పున ఇచ్చాం. తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేదన్నాం. ఎవరు ఎక్కువ చేసినట్లు జగన్ రెడ్డీ?'' అని ప్రశ్నించారు. 

read more  అనకాపల్లి హార్టికల్చర్ పరిశోధన కేంద్రం కడపకు: జగన్ పై అయ్యన్న ఆగ్రహం (వీడియో)

''టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తామన్న జగన్ రెడ్డి... టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.3వేల కోట్లు ఇచ్చాం. కానీ మీరిచ్చింది ఎంత.? మహిళలకు చెల్లించే సొమ్ముకు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని నాడు డిమాండ్ చేసిన మీరు నేడు ఆ రూ.27వేల కోట్లకు రూ.4వేల కోట్ల వడ్డీ సొమ్మును ఎందుకు చెల్లించడం లేదు? వడ్డీ రాయితీలను సకాలంలో చెల్లించకుండా, సకాలంలో రుణాలు మాఫీ చేయకుండా మహిళలను వంచిస్తూ,  మోసం చేస్తూ ఏదో చేసేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''మీరు ప్రకటించిన ఆసరా పథకం ద్వారా మహిళలను వంచిస్తున్నారే తప్ప ఏమాత్రం కూడా న్యాయం చేయడం లేదు. మొన్నటికి మొన్న చేయూత ద్వారా అందించే సొమ్ముతో పాటు అమూల్, హెచ్.యూ.ఎల్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారు.? ఎంత మందికి పారిశ్రామికంగా అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలి. మాయ మాటలు చెబుతూ, మోసపూరిత ప్రకటనలు చేస్తూ మహిళా లోకాన్ని వంచించడం ఇకనైనా జగన్ రెడ్డి మానుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి'' వంగలపూడి అనిత హెచ్చరించారు.