మహిళల రక్షణ, కాకినాడలో వైసిపి ఎమ్మెల్యే కారు డ్రైవర్ హత్య తదితర అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వంపై టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వంపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. మహిళల్ని గౌరవిస్తాము, మహిళల భద్రతే మా ధ్యేయం, మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకుంటున్న సీఎం జగన్, ఆయన భజనబృందమంతా ఆడబిడ్డలు గొంతెత్తినే ఎందుకంతలా వణికిపోతోంది అని నిలదీసారు. 

జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఆడబిడ్డలకు భయపడుతోందని... వారికి సమాధానం చెప్పుకోలేక పోలీసుల సాయంతో భయపెడుతున్నారని అనిత ఆరోపించారు. మహిళలు గొంతెత్తితే భయంతో వణికిపోతున్న ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. 

''ఆడదాన్ని కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉంటే ఎంత...లేకపోతే ఎంతా! ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగితే తన తండ్రికే అవమానం అని మేం అంటాము. తనతండ్రి గౌరవం కాపాడేవాడే అయితే జగన్ రెడ్డి ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు మహిళలకు రక్షణ ఉందా? ప్రతిసారీ మేం ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను చెబుతూనే ఉన్నాం. కానీ పాలకులకు అవి అర్థంకావడం లేదు'' అని అనిత ఆరోపించారు. 

''తన మూడేళ్ల పాలనలో మహిళలపై 1000కి పైగా దారుణాలు జరిగితే వాటికి సమాధానం చెప్పలేకే జగన్ రెడ్డి, ఆయన భజనబృందం ఆడవాళ్లపై ప్రతాపం చూపుతోంది. ఇలాంటివి చేస్తున్నందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా? బయటకువచ్చి మీసాలు తిప్పి, తొడలుకొట్టి, సినిమా డైలాగులు చెప్పి, జబ్బలు చరచడం, అక్కడికిరండి.. ఇక్కడికి రండి చూసుకుందామనే వారంతా ఆడవాళ్లపై దాడులు చేస్తున్నారంటే వారు ఎలాంటి మగాళ్లో అర్థమవుతోంది. ఏం చేతకాక, ఏమీ చేయలేకే మహిళలపై ప్రతాపం చూపుతున్నారు'' అని ఆరోపించారు. 

''సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితేనే జగన్ రెడ్డి, ఆయన పేటీఎం బ్యాచ్ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది? వైసీపీ పేటీఎం కుక్కలు, మహిళల్ని అవమానిస్తూ నీచాతినీచంగా అనేక సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టింగ్ లు పెట్టారు. వారు ఎలా మాట్లాడిన, ఎంతలా అవమానించినా భరించాలా... తిరిగి స్పందించకూడదా? స్పందిస్తే, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులుపెడితేనే ఓర్చుకోలేనివారు... వారు అనేమాటలు, చేసే వికృతాలకు మహిళలు ఎంతలా నొచ్చుకుంటారో ఆలోచించరా?'' అని మండిపడ్డారు. 

''నిన్న నెల్లూరులో టీడీపీ మహిళానేత రేవతి, ఆమె భర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ గూండాలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల సాక్షిగా రేవతిపై జరిగిన దాడికి పోలీసులు సిగ్గుపడాలా? జగన్ రెడ్డి సిగ్గుపడాలా? అతనికి సిగ్గులేదని మాకు తెలుసు.. కానీ రేవతి విషయంలో పోలీసుల బుద్ధి ఏమైంది?'' అని విమర్శించారు. 

''మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి, మా నాయకుడు లోకేశ్ కి మధ్యన జరిగిన సంభాషణల్ని ప్రస్తావిస్తూ, అనిల్ అక్రమ లే అవుట్ల గురించి రేవతి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అదితప్పా? సోషల్ మీడియా పోస్టులకు ఉన్నవిలువ ఆడబిడ్డల తాళిబొట్లకు లేదా? అదే పోలీసులు టీడీపీ మహిళలు వారికి జరిగిన అన్యాయం, వేధింపులపై కేసులుపెడితే మాత్రం తీసుకోరు. ఎందుకంటే పోలీసులు వైసీపీ తొత్తులు. నెల్లూరు పోలీసులు మరీతొత్తులుగా మారారు. వారికి జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచివస్తున్నాయా... లేక వైసీపీ కార్యాలయం నుంచి వస్తున్నాయా?'' అని అనిత మండిపడ్డారు. 

''వైసీపీ ప్రభుత్వం ఆడదానికి భయపడుతోంది కాబట్టే పోలీసుల సాయంతో ఆడవాళ్లపై దాడిచేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మహిళ పోస్ట్ పెడితే దానికి పోలీసులే రంగంలోకి దిగి స్టేషన్ కు పిలిపించి కొట్టిస్తారా? ఆమె పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయిస్తారా? వైసీపీ భయంతో వణుకుతోంది కాబట్టే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు'' అన్నారు. 

''మీరుచేసే ఇలాంటి తాటాకుచప్పుళ్లకు తెలుగు మహిళలు భయపడరని గుర్తుంచుకోండి. తెలుగుదేశంలో ఉండే మహిళలంతా ధైర్యంతో, తెగింపుతోనే ఉంటారు. భయపెట్టి, కేసులతో తెలుగు మహిళల్ని అడ్డుకోలేరని గుర్తుంచుకోండి. ఆడవాళ్ల తాళిబొట్లను తెంచేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారముందని తాళిబొట్లతో ఆడుకుంటారా? మీరుచేసే వెధవ పనులపై మేం మాట్లాడకూడదా? మీరుచెప్పింది వినకపోయినా, మీ తప్పుల్నిఎత్తిచూపినా, మీ ఇంగితజ్ఞానాన్ని ఎత్తిచూపినా పోలీసుల సాయంతో కేసులుపెట్టి వేధిస్తారా? మీ వెధవపనులు తెలుసుకుంటే వారిని చంపేస్తారు కూడా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ ఎమ్మెల్సీ తనవద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపేయడం'' అని అనిత ఆరోపించారు. 

''గతంలో రౌడీషీటర్ గా ఉన్న వ్యక్తిని జగన్ రెడ్డి ఎమ్మెల్సీని చేస్తే, అతనేమో సొంతడ్రైవర్ ని చంపేసి దర్జాగా తిరుగుతున్నాడు. జగన్ రెడ్డి ఎవరికైనా పదవులు ఇచ్చే ముందు వాడిపై ఎన్నికేసులున్నాయి... ఎంత అక్రమార్జన చేశాడు? ఎన్ని హత్యలు, అత్యాచారాలు చేశాడు, వాడికి పదవిస్తే మనకెంత ఇస్తాడు..లాంటివే లెక్కలో వేసుకుంటాడు. అలా ఆలోచించబట్టే ఎమ్మెల్సీ పదవికి ఎలాంటి అర్హత, అనుభవంలేని అనంత ఉదయభాస్కర్ ని మండలిసభ్యుడిని చేశాడు. వైసీపీ ఎమ్మెల్సీ అయితే మనిషిని చంపేస్తాడా? చంపిందికాక శవాన్ని తనకారులోనే తీసుకెళ్లి మృతుడి కుటుంబంవద్ద పడేస్తాడా? ఎంత ధైర్యముంటే ఆపని చేయాలి? దళితుల్ని చంపినా వారేం చేయలేరన్నదే మీ ఉద్దేశం. కాబట్టే ఇంత దారుణానికి ఒడిగట్టారు'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''సుబ్రహ్మణ్యం భార్య తన భర్తను చంపినవారిని శిక్షించాలని, అప్పటివరకు పోస్ట్ మార్టమ్ జరగనివ్వమని పట్టుబడితే ఆమెపై పోలీసులు చేయిచేసుకుంటారా? ఒక ఆడదానికి సమాధానం చెప్పలేరా? వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చచ్చిపోయేలా కొట్టడం పోలీసులకు సామాన్య విషయమా? సుబ్రహ్మణ్యం భార్యగట్టిగా మాట్లాడితేనే పోలీసులు హత్యకేసు నమోదుచేస్తారా? సోషల్ మీడియాలో ఏదో చిన్న పోస్ట్ పెడితేనే రాత్రిపగలనే తేడాలేకుండా స్పందించే పోలీసులు, దళిత యువకుడిని చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయలేక పోవడం సిగ్గుచేటుకాదా? దళితయవకుల్ని కొట్టిచంపినా, శిరోముండనాలు చేయించినా సీఐడీవారికి అవేవీ కనిపించవు. ఎక్కడో ఏదో జరిగితే ఆఘటనకు ఏమాత్రం సంబంధంలేని మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ అధికారపార్టీ ఎమ్మెల్సీనే స్వయంగా ఒకడినిచంపితే, అది పోలీసులకు పట్టదా?'' అని అనిత నిలదీసారు. 

''ప్రభుత్వం చెప్పిందని మాజీ మంత్రులు, సొంతపార్టీ ఎంపీలను మాత్రం ఎక్కడున్నా ఠక్కున పట్టుకొస్తారు. పోలీసులు వారి పనితనాన్ని, పవర్ ని ఎందుకు రాజకీయ నేతలకు అమ్మేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికప్పుడు న్యాయం కోసం, రక్షణ కోసం ఆడబిడ్డలు పోరాడితేతప్ప పోలీసులు స్వచ్ఛందంగా స్పందించరా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్రతినిధులైనా, పోలీసులైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని హెచ్చరిస్తున్నాం. ఆడవారిని ఏదైనా చిన్నమాటంటేనే ఒప్పుకోని సమాజం మనది. అలాంటిది గర్భిణి అనికూడా చూడకుండా మహిళను బెదిరిస్తారా? వైసీపీఎమ్మెల్సీ దళిత యువకుడిని చచ్చేలాకొట్టినా, అతన్ని అరెస్ట్ చేయరా?'' అని అడిగారు. 

''తప్పులు చేసే వాళ్లు పోలీసులకు దొరకరు... ఆ తప్పుల్నిఎత్తిచూపేవాళ్లను మాత్రం వెంటనే పట్టు కొస్తారు. ఆడబిడ్డల రక్షణకోసం వారికి గన్ లైసెన్స్ లు ఇప్పించాలని ఇదివరకే డిమాండ్ చేశాము. ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేదని అర్థమైంది. మగాళ్లము అని చెప్పుకునేవారు, మగాడని భజనచేసేవారు... ఆడబిడ్డలను నిజంగా కాపాడలేరని అసమర్థులని తేలిపోయింది. రేపు మా ప్రభుత్వం రాగానే మహిళలను వేధించేవారందరి భరతంపడతాం'' అని వంగలపూడి అనిత హెచ్చరించారు.