విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గల కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ఆస్పత్రి అగ్ని ప్రమాదం ఘటనపై సినీ హీరో రామ్ చేసిన వ్యాఖ్యలను గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని, రామ్ సినిమాలు ఒక్క కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా అని వంశీ అన్నారు. వేరేవాళ్లు రామ్ సినిమాలు చూడరా అని అడిగారు. వేరే కులం వారిని సినిమాలు చూడవద్దని చెప్పమనండని ఆయన అన్నారు. 

చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపిందా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

చంద్రబాబు ఒక్కడే తమ సామాజిక వ్రగానికి నాయకుడు కారని, గతంలో చాలా మంది నాయకులు తమ సామాజిక వర్గం కోసం పనిచేశారని ఆయన అన్నారు. చంద్రబాబుతోనే తమ సామాజిక వర్గానికి ముప్పు ఉందని, చందర్బాబు ఉన్న సమస్యలను అన్నింటినీ కులానికి రుద్దుతాడని ఆయన అన్నారు. 

పదేళ్లు హైదరాబాదులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఒటుకు నోటు కేసులో చిక్కుకుని అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలను అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకుని వచ్చారని ఆయన చంద్రబాబుపై వ్యాఖ్యానించారు. ప్రతిసారీ అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాదులో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని ఆయన అన్నారు.