విజయవాడ: తాను బెదిరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పోలీసులకు చేసిన ఫిర్యాదుపై గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ స్పందించారు. వల్లభనేని వంశీపై యార్లగడ్డ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. 

అయితే, వివాదం ముదురుతుండడంతో వల్లభనేని వంశీ స్పందించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులోకి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నానిని కూడా లాగారు. సత్సంబంధాలను కొనసాగించేందుకే మీ ఇంటికి వస్తానని తాను ఫోన్ చేసినట్లు వంశీ చెప్పారు. 

"మీ అపాయింట్‌మెంట్‌ కోసమే ఫోన్‌ చేశాను.. అందులో భాగంగానే మా అనుచరులను మీ ఇంటికి పంపా. నేను మీ ఇంటికి రావడం ఇబ్బంది అయితే మీరే మా ఇంటికి రండి. మీరు సమయం, తేదీ చెబితే నేను సిద్ధంగా ఉంటాను" అని వంశీ తన బహిరంగ లేఖలో అన్నారు. 

"ఓ కప్పు కాఫీతాగి వెళ్లొచ్చు. మీ అనుచరులను కూడా మీవెంట తీసుకు రండి. మా అనుచరులను మీ ఇంటికి పంపిస్తే నేను బెదిరిస్తున్నానని మీరు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు" అని ఆయన అన్నారు. 

"ఎన్నికల ముందు మీరు ఎవరో తెలియదు.. కొడాలి నాని ద్వారానే పరిచయం అయ్యారు. మీరు గన్నవరం రాకముందు రెండు కేసుల్లో మీకు సాయం చేశాను. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు" అని వంశీ అన్నారు. 

"దేవుడున్నాడు అన్నీ ఆయనకు తెలుసు.. అందరికీ దేవుడే న్యాయం చేస్తాడు" అని వల్లభనేని వంశీ తన బహిరంగ లేఖలో అన్నారు.