విశాఖ పట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సుకుమారవర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరేళ్ల కిందట జరిగిన సహకార ఎన్నికల్లో ఉప్పలపాటి సుకుమారవర్మ డీసీసీబీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

కొంతకాలం తర్వాత తన తండ్రి.. అప్పటి మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజుతో పాటు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. అయితే 2018 ఆగస్టు నెలలో డీసీసీబీ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది.

అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం సుకుమారవర్మ పదవీకాలాన్ని పొడిగించలేదు. కానీ మిగిలిన 23 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు.. ఆ తర్వాత మరో ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే డీసీసీబీ ఛైర్మన్ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తన పదవీకాలాన్ని పొడిగించకుండా.. డీసీసీబీ డైరెక్టర్లను మాత్రం కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ సుకుమారవర్మ అప్పట్లో కోర్టును ఆశ్రయించారు.

దీంతో న్యాయస్థానంలో ఉప్పలపాటికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం ఆయనను ఛైర్మన్‌గా కొనసాగించేందుకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

దీంతో వర్మతో పాటు ఆయన తండ్రి రమణమూర్తి రాజు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. రాజు యలమంచిలి నుంచి తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడంతో తన కుమారుడిని తిరిగి ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేలా రమణమూర్తి రాజు పావులు కదిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 409ని జారీ చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీ వరకు వుండటంతో సుకుమారవర్మ అప్పటి వరకు ఛైర్మన్‌గా ఉంటారు. ఈ లోగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే కొత్త పాలకవర్గం ఏర్పాటవుతుంది.

లేదా ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే డీసీసీఐ ఛైర్మన్‌గా తాను చేసిన అభివృద్దే తనను తిరిగి ఛైర్మన్‌గా కొనసాగించేందుకు అవకాశం వచ్చిందని సుకుమారవర్మ తెలిపారు.

తాను బాధ్యతలు చేపట్టినప్పుడు బ్యాంక్ టర్నోవర్ రూ.600 కోట్లు వుండేదని.. ప్రస్తుతం రూ.1200 కోట్లకు చేరిందని తెలిపారు. జిల్లాలో 18 బ్యాంకుల్లో ఏటీఎంలు, ఒక మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేసిన ఘనత తనదేనన్నారు.