ఫేస్ బుక్ పరిచయంతో బాలికను వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత ఇంతియాజ్ గతంలోనూ ఎన్నో కేసులున్నాయి. అతను ఎంతోమంది యువతులను కూడా ఇలాగే వేధించాడని తేలింది.
అనంతపురం : రాళ్ళపల్లి ఇంతియాజ్... కందికుంట అనుచరుడు. తెలుగు యువత నల్లచెరువు మండల ప్రధాన కార్యదర్శి. మెడలో ఎప్పుడూ పసుపు కండువాతో కనిపించే ఇంతియాజ్ కు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అలవాటు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడం.. ఆ తర్వాత వారిని లైంగిక వేధింపులకు గురిచేయడం అతడికి పరిపాటి. ఈ క్రమంలోనే తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణిని వేధించాడు.
‘నన్ను ప్రేమించకపోతే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతాను’ అంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు సెల్ఫీ వీడియోలో తాను వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంట తడిపెడుతున్నారు.
ఫేస్ బుక్ లో పరిచయంతో టీడీపీ నేత లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని బాలిక ఆత్మహత్య..
గతంలోనూ..
ఇంతియాజ్ గతంలోనూ నల్లచెరువు మండలంలో ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధించాడు. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి అతనిపై కేసులు లేకుండా చేశారు. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, ప్రేమలోకి దించడం, చివరకు బ్లాక్మెయిల్ చేసి కామవాంఛ తీర్చుకోవడం ఇంతియాజ్ కు అలవాటుగా మారింది. కుటుంబ పరువు బజారున పడుతుందనే భయంతో ఎంతో ఃమంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక పోయారు. సంధ్యారాణి ఆత్మహత్య ఘటనతో ఇంతియాజ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
చంపుతామని సీఐకి బెదిరింపు
ఇటీవల కదిరి ఎన్జీవో కాలనీకి సంబంధించిన ఓ వివాదంలో దూరిన కందికుంట, ఆయన అనుచరులు.. భూ యజమానులపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జెసిబి అద్దాలు పగలగొట్టడంతో పాటు వారి ఆగడాలను అడ్డుకోవాలని చూసిన పట్టణ సీఐ తమ్మిశెట్టి మధుపై కూడా దాడికి ప్రయత్నించారు. వారిలో సంధ్యారాణి మృతికి కారణమైన రాళ్లపల్లి ఇంతియాజ్ కూడా ఉన్నాడు. ‘మా అన్న కందికుంటనే అడ్డుకుంటావా? నీకు ఎంత ధైర్యం. నిన్ను నరికి చంపుతాం’ అంటూ కందికుంట అనుచరుడు మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయినా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందువల్లే పేట్రేగి పోతున్నట్టు తెలుస్తోంది.
ఆస్పత్రిలో హైడ్రామా..
సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు శుక్రవారం ఇంతియాజ్ ను అదుపులోకి తీసుకోగా, అతను నాటకానికి తెరలేపాడు. కోర్టులో, ప్రభుత్వ ఆసుపత్రిలో తనను పోలీసులు కొట్టారంటూ హంగామా చేశాడు. అంతకు ముందు తన ఆరోగ్యం సరిగా లేదని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంతియాజ్ ను రిమాండ్కు తరలించారు.
